UPDATES  

NEWS

 బెంచ్‌పైకి కాగితాలు విసిరి.. సుప్రీంకోర్టులో పిటిషనర్ వీరంగం..!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ హద్దులు మీరు ప్రవర్తించాడు. న్యాయమూర్తులపై దూషణలకు దిగడమే కాకుండా, కేసు పత్రాలను వారి వైపు విసిరికొట్టి తీవ్ర గందరగోళం సృష్టించాడు. తక్షణమే అప్రమత్తమైన భద్రతా అధికారులు అతడిని కోర్టు హాలు నుంచి బలవంతంగా బయటకు పంపించారు.

 

అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రబల్ ప్రతాప్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం ఎదుట ఆయన స్వయంగా వాదనలు వినిపించాడు. అయితే, విచారణ ప్రారంభంలోనే పిటిషనర్ న్యాయమూర్తులను ‘జ్యుడీషియల్ సర్వెంట్’ అని సంబోధిస్తూ, ‘లక్నో ఏసీపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను’ అని వ్యాఖ్యానించాడు. దీనిపై తీవ్ర విస్మయం వ్యక్తం చేసిన జస్టిస్ విశ్వనాథన్, “మమ్మల్ని ఆదేశిస్తున్నావా?” అని ప్రశ్నించాడు.

 

ఈ క్రమంలో ప్రబల్ ప్రతాప్ మరింత ఆవేశంతో ఊగిపోతూ, తన చేతిలోని పత్రాలను గాలిలోకి విసిరాడు. అదే సమయంలో, ఆ బెంచ్‌లో లేని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌పై కూడా దూషణలకు దిగాడు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే రంగప్రవేశం చేసి అతడిని కోర్టు హాలు నుంచి వెలుపలికి తరలించారు.

 

ఒక సైబర్ క్రైమ్ సిండికేట్‌కు సంబంధించిన కేసులో, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 173(4) కింద తాను సమర్పించిన దరఖాస్తును ప్రైవేట్ కంప్లైంట్‌గా మార్చడాన్ని సవాల్ చేస్తూ ప్రబల్ ఈ పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు హాలులో చోటుచేసుకున్న ఈ అసాధారణ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |