UPDATES  

NEWS

 ‘నా కొడుకు నీ ఫ్యాన్.. వాడ్ని క్రిమినల్ అంటావా..?’ పవన్‌పై సాయికృష్ణ తల్లి ఫైర్..!

ఏపీలో సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఏ స్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శనివారం మెజిస్టీరియల్ విచారణకు హాజరైన మృతుడి తల్లి విజయ లక్ష్మీ.. అనంతరం మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్ కు కులం ఏంటి అంటూ ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. తాము కాపులమని స్పష్టం చేసిన విజయ లక్ష్మి.. పవన్ కు ఓటు వేసినందుకు బాగా బుద్ది చెప్పారని అన్నారు. ‘నా కొడుకు నీ అభిమాని. వాడిని క్రిమినల్ అంటావా?’ అని నిలదీశారు.

 

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో పెద్దవాళ్ల ప్రమేయం ఉందని విజయలక్ష్మి అనుమానం వ్యక్తం చేశారు. అందుకే చాలా దారుణంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను కూడా చంపాలని కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇంటి వద్దకు వచ్చి తన బిడ్డను తీసుకెళ్లిన వాళ్లని ఇంకా అరెస్టు కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తన బిడ్డ బూడిదైన తనకు తెచ్చి ఇవ్వాలని.. లేదంటే నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటానని బెదిరించారు.

 

 

తన బిడ్డ మరణం వెనుక ఎవరెవరు ఉన్నారో వారందరికి శిక్ష పడాలని విజయలక్ష్మి డిమాండ్ చేశారు. ఇప్పటివరకూ 4-5 మాత్రమే అరెస్టు అయ్యారని.. మిగిలిన వాళ్లను ఎందుకు కటకటాల్లోకి పంపలేదని ప్రశ్నించారు. తన బిడ్డ చావుకు కారణమైన వాళ్లెవరినీ వదిలి పెట్టవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ‘అసలు నా కొడుకుని ఎందుకు చంపారు? కారణం ఏంటి? నాకు చెప్పాలి’ అంటూ పట్టుబట్టారు.

 

తన బిడ్డ క్రిమినల్ అంటూ పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరి కాదని విజయలక్ష్మీ అన్నారు. గాదె సాయికృష్ణ గురించి నిజం తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ‘మేం కాపులం. పవన్ కళ్యాణ్ కోసమే ఓట్లు వేసి ప్రభుత్వాన్ని గెలిపించాం’ అంటూ మరోమారు ఆమె చెప్పుకొచ్చారు.

 

కొద్ది రోజుల క్రితం గాదె సాయికృష్ణ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. కృష్ణలంకలో ఒక గొడవ జరిగితే క్రిమినల్ కు కులాన్ని ఎలా అండగడతారని ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా.. ఏ కులం వారు చేసినా.. తప్పే కదా అని నిలదీశారు. కాపు అయితే ఒప్పు.. ఇంకొకరు అయితే తప్పు అవుతుందా అని ప్రశ్నించారు. అన్ని వర్గాలను సమానంగా చూడటమే అసలైన సామాజిక న్యాయమని అన్నారు. కులరాజకీయం పొలిటికల్ విక్టరీ అవుతుందేమో కానీ, సామాజిక విక్టరీ కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |