UPDATES  

NEWS

 సాయికృష్ణ కేసులో కీలక పరిణామం… సీఐ నాగరాజుకు 8 రోజుల పోలీస్ కస్టడీ..

సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన సీఐ నాగరాజును ఎనిమిది రోజుల పాటు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఈ కేసు విచారణలో భాగంగా నాగరాజును మరింత లోతుగా ప్రశ్నించేందుకు 12 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని సిట్ అధికారులు కోర్టును అభ్యర్థించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఎనిమిది రోజుల కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. దీంతో రేపటి నుంచి నాగరాజును సిట్ అధికారులు విచారించనున్నారు.

 

రేపటి నుంచి ఎనిమిది రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో ఆడియో, వీడియో రికార్డుతో విచారణ జరపాలని కోర్టు పేర్కొంది. విచారణ అనంతరం రికార్డులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. జూన్ 23న అరెస్టయిన నాగరాజు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

 

సుమారు రెండు నెలల క్రితం గాదె సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి, తీవ్రంగా హింసించడం వల్లే అతను మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా, సాక్ష్యాలను మాయం చేసేందుకు కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని స్థానిక విద్యుత్ శ్మశానవాటికలో దహనం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే సీఐ నాగరాజు అరెస్టయ్యారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |