UPDATES  

NEWS

 భారత్-జపాన్ కీలక ఒప్పందం..!

భారత్, జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత సులభతరం చేసే దిశగా మరో కీలక అడుగు పడనుంది. ఇరు దేశాల మధ్య లావాదేవీలకు అమెరికా డాలర్‌పై ఆధారపడకుండా, నేరుగా రూపాయి-యెన్‌లలోనే చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాయి. జులై 1 నుంచి 3 వరకు జపాన్ ప్రధాని సనా తకాయిచి భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో జరిపే భేటీలో ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

 

ఈ కొత్త ఒప్పందం ప్రకారం, జపాన్‌కు చెందిన ప్రవాసేతరులు (non-residents) భారత బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు అనుమతిస్తారు. దీనివల్ల ఇరు దేశాల ఆర్థిక సంస్థల మధ్య నేరుగా చెల్లింపులు జరపడం సాధ్యమవుతుంది. 2026 ఆర్థిక సంవత్సరంలోగా భారత రిజర్వ్ బ్యాంక్ (RBI), జపాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య ఈ మేరకు ఒక అవగాహన ఒప్పందం కుదరనుంది. ఇరు దేశాల ప్రధానుల సంయుక్త ప్రకటనలో కరెన్సీ సహకారం అంశాన్ని చేర్చడం ఇదే మొదటిసారి కానుంది.

 

ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే విదేశీ మారకం, రెమిటెన్స్ ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయి. మూడో దేశంలోని కరస్పాండెంట్ బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరపాల్సిన అవసరం లేకపోవడంతో సమయం కూడా ఆదా అవుతుంది. తద్వారా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న జపాన్ కంపెనీలకు ప్రయోజనం చేకూరడమే కాకుండా, ప్రైవేట్ పెట్టుబడులు కూడా పెరిగేందుకు దోహదపడుతుంది.

 

2025 నాటి భారత్-జపాన్ జాయింట్ విజన్‌లో ఈ కరెన్సీ సహకారం గురించి ప్రస్తావించారు. ఇప్పటికే జపాన్ ఇండోనేషియాతో ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోగా, మలేషియాతోనూ చర్చలు జరుపుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యను చూస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |