UPDATES  

NEWS

 అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్రముప్పు..! కేంద్రం హై అలర్ట్‌ ప్రకటన..!

జులై 3న ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్ర నేపథ్యంలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నించే అవకాశం ఉందని భారత నిఘా సంస్థలు అప్రమత్తం చేసినట్లు సమాచారం. దీంతో యాత్ర మార్గమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

 

నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా, బలూచిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రాంతాల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ భారత్‌లో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమర్‌నాథ్‌ యాత్రను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

 

నిఘా సంస్థలు గుర్తించిన సమాచారం ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లో అడవుల్లో దాక్కున్న కొంతమంది ఉగ్రవాదులతో పాక్‌ మూకలు సంప్రదింపులు జరిపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పెద్దఎత్తున దాడులు జరిపేలా వారిని ప్రేరేపించే యత్నాలు జరుగుతున్నాయని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.

 

ఈ హెచ్చరికల నేపథ్యంలో యాత్ర మార్గంలో భారీగా పోలీసు, భద్రతా బలగాలను మోహరించారు. ఉగ్రవాద వ్యతిరేక నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. అత్యాధునిక కృత్రిమ మేధ ఆధారిత కెమెరాలు, డిజిటల్‌ స్కానింగ్‌ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. యాత్రికుల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

 

ఇదే సమయంలో జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. బలగాలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ, యాత్రికులు అధికారిక సూచనలు పాటించాలని, వదంతులను నమ్మొద్దని భద్రతా వర్గాలు సూచిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |