UPDATES  

NEWS

 పోలీసుల చేతికి కొత్త అస్త్రం..! కృత్రిమ మేధతో సోషల్ మీడియాపై నిఘా..

సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపటానికి హైదరాబాద్ పోలీసులు సరికొత్త అస్త్రం ‘సాక్ ఐ’ని సమకూర్చుకున్నారు. ఏఐ ఆధారితంగా పని చేసే దీని ద్వారా సోషల్ మీడియాలో జనం మధ్య విభేధాలు రెచ్చగొట్టేలా…వ్యక్తుల ప్రతిష్టను దెబ్బ తీసేలా పోస్టులు పెట్టే వారిపై నిరంతర నిఘా పెట్టటంతోపాటు వారిపై చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఐటీ విభాగం రూపొందించిన సాక్ ఐ గురించి కమిషనర్ వీ.సీ.సజ్జనార్ వివరాలు తెలియచేస్తూ గతంలో సోషల్ మీడియాపై పర్యవేక్షణకు భారీ సంఖ్యలో సిబ్బంది అవసరమయ్యేవారన్నారు. కొత్తగా తెచ్చిన సాక్ ఐ ద్వారా అన్నీ ఆటోమేటెడ్ పద్దతిలో నిరంతరాయంగా జరుగుతాయని చెప్పారు. దీనిలోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ డ్యాష్ బోర్డు ద్వారా డయల్ 100కు వచ్చే ఫోన్ కాల్స్, అంతర్గత సమాచారం.

 

మతపరమైన అంశాలను..

కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న ప్రధాన సంఘటనల వివరాలను ఒకేచోట క్రోడీకరించి క్షేత్రస్థాయిలో పని చేసే అధికారులకు అవగాహన కల్పించవచ్చని తెలిపారు. ప్రయోగ దశలోనే సాక్ ఐ అద్భుత విజయాలను సాధించిందని చెప్పారు. పురానాపూల్ చౌరస్తాలో జరిగిన సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 85 ద్వేషపూరిత, మతపరమైన అంశాలను దీని ద్వారా గుర్తించామన్నారు. గుడిమల్కాపూర్ వివాదానికి సంబంధించి సోషల్ మీడియాలో ఉన్న 125 పోస్టులను కూడా గుర్తించినట్టు వివరించారు. ఇలాంటి కంటెంట్‌ను సకాలంలో తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టడం ద్వారా శాంతి సామరస్యాలను కాపాడటమే కాకుండా, విద్వేషాలను రేకెత్తించే వారిని గుర్తించడం సాధ్యమైందన్నారు.

 

ప్రత్యేకించి..

ప్రత్యేకించి మాదకద్రవ్యాల సరఫరా, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ వ్యవస్థ దృష్టి పెడుతుందన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్, సైబర్ బుల్లింగ్, స్టాకింగ్ వంటి అంశాలను ఏఐ మోడల్స్ స్వయంగా గుర్తించి అప్రమత్తం చేస్తాయని చెప్పారు. పోస్టుల తీవ్రతను బట్టి వాటిని హై, మీడియం, లో రిస్క్ కేటగిరీలుగా విభజించి, అభ్యంతరకర పోస్టులను తొలగించేలా సంబంధిత సోషల్ మీడియా సంస్థలను సూచిస్తామన్నారు. నేరగాళ్ల నెట్‌వర్క్ ను విశ్లేషణ చేసే సామర్థ్యం ఈ అప్లికేషన్ ప్రత్యేకత అని చెప్పారు. దీని వల్ల వివాదాస్పద పోస్టులను పదేపదే షేర్ చేసే వారిని, వాటిని వైరల్ చేసే ఖాతాలను ఇట్టే పసిగట్టే వీలుంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందన్నారు.

 

ప్రతీ ఫిర్యాదుకు..

ప్రతీ ఫిర్యాదుకు ఒక యూనిక్ ట్రాకింగ్ నంబర్ కేటాయించి అది పరిష్కారమయ్యే వరకు ఎండ్-టు-ఎండ్ మానిటరింగ్ చేయవచ్చన్నారు. నగరంలో ప్రతిరోజూ జరిగే నిరసనలు, ర్యాలీలు, మతపరమైన ఊరేగింపుల వంటి కార్యక్రమాలపై ముందస్తు నిఘా ఉంచేందుకు ‘ఈవెంట్ బేస్డ్ మానిటరింగ్’ ఫీచర్‌ను ఇందులో పొందుపరిచినట్టు చెప్పారు. నిర్ణీత కీవర్డ్స్ ఆధారంగా సోషల్ మీడియా కార్యకలాపాలను ట్రాక్ చేస్తూ, ఏదైనా ముప్పు పొంచి ఉంటే వెంటనే క్షేత్రస్థాయి పోలీసులను అప్రమత్తం చేయవచ్చని వివరించారు.

 

పబ్లిక్ ప్రొఫైల్స్..

అలాగే నేర పరిశోధనలో కీలకంగా మారిన ఎస్వోసీఎంఐఎన్టీ, ఓఎస్ఐఎన్టీచవంటి ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఇందులో అంతర్భాగంగా ఉండటంతో సైబర్ కేసుల ఛేదన సులభతరం కానుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ప్రొఫైల్స్ మరియు కీవర్డ్స్ ఆధారంగా సెర్చ్ చేసే సామర్థ్యం ఉన్న గ్లోబల్ సెర్చ్ ఇంజన్ ద్వారా ఏదైనా అంశంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను, వస్తున్న కథనాలను తక్షణమే విశ్లేషించే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. అత్యాధునిక ఏఐ సాంకేతికతతో కూడిన ఈ ‘సాక్ ఐ’ వ్యవస్థ పోలీసుల పనిభారాన్ని తగ్గించడమే కాకుండా, నేర నివారణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని కమిషనర్ సజ్జనార్ చెప్పారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |