UPDATES  

NEWS

 ఏపీలో నవ శకం..! ఏఎంసీఏ ప్రాజెక్టుతో రాయలసీమ ఇకపై ‘రక్షణ సీమ’..!

ఒకప్పుడు రత్నాలకు, ఆ తర్వాత ఉద్యాన పంటలకు నెలవైన రాయలసీమ, ఇప్పుడు దేశ రక్షణ రంగంలో కీలక భూమిక పోషించేందుకు సిద్ధమవుతోంది. స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి కేంద్రంగా నిలవనుంది. ‘రతనాల సీమ’గా చరిత్రలో, ‘ఉద్యాన సీమ’గా వర్తమానంలో నిలిచిన ఈ ప్రాంతం, భవిష్యత్తులో ‘రక్షణ సీమ’గా సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో రక్షణ, డ్రోన్ రంగాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు రాయలసీమ వేదిక కానుంది. ఇందులో భాగంగా, శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఏఎంసీఏ ప్రాజెక్టుకు అంకురార్పణ జరగనుంది

 

పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు భూమిపూజ

 

దేశ రక్షణ వ్యవస్థలో గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు పుట్టపర్తిలో పునాది రాయి పడనుంది. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), డీఆర్‌డీఓ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. సుమారు రూ.15,803 కోట్ల భారీ బడ్జెట్‌తో, 650 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు.

 

ఈ ప్రాజెక్టులో భాగంగా, భారతదేశపు మొట్టమొదటి 5వ తరం స్టెల్త్ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అభివృద్ధి చేస్తారు. స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్, సూపర్ క్రూయిజ్ వంటి అత్యాధునిక సామర్థ్యాలు ఈ యుద్ధ విమానాల ప్రత్యేకత. కేవలం తయారీనే కాకుండా, వాటి టెస్టింగ్ కూడా పుట్టపర్తిలోనే చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 7,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. దీనికి అనుబంధంగా వచ్చే ఇతర పరిశ్రమల ద్వారా మరో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందని, దీనికోసం ప్రభుత్వం మరో 400 ఎకరాలు కేటాయించింది.

 

డ్రోన్ సిటీ, ఇతర ప్రాజెక్టులతో సమగ్ర అభివృద్ధి

 

పుట్టపర్తి ప్రాజెక్టుతో పాటు, కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న ‘డ్రోన్ సిటీ’ ద్వారా దేశంలోనే అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టమ్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. రాయలసీమ, ప్రకాశం జిల్లాల పరిధిలో రక్షణ, డ్రోన్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఏఎంసీఏ ప్రాజెక్టుతో పాటు మరో 12 ప్రాజెక్టులకు కూడా శుక్రవారం శంకుస్థాపన జరగనుంది. వీటిలో 4 డిఫెన్స్ ప్రాజెక్టులు కాగా, 8 డ్రోన్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 12 ప్రాజెక్టుల ద్వారా అదనంగా రూ.4,145 కోట్ల పెట్టుబడులు, 6,071 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

 

మరో 12 ప్రాజెక్టుల వివరాలు:

కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్: రూ.1430 కోట్ల పెట్టుబడి, 565 మందికి ఉపాధి

భారత్ డైనమిక్స్ లిమిటెడ్: రూ.489 కోట్ల పెట్టుబడి, 500 మందికి ఉపాధి

హెచ్ఎఫ్ సీఎల్: రూ.1040 కోట్ల పెట్టుబడి, 870 మందికి ఉపాధి

ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్: రూ.500 కోట్ల పెట్టుబడి, 2050 మందికి ఉపాధి

అల్గోబాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.34 కోట్ల పెట్టుబడి, 52 మందికి ఉపాధి

డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.255 కోట్ల పెట్టుబడి, 850 మందికి ఉపాధి

డ్రోన్ ల్యాబ్ టెక్నాలజీస్: రూ.5 కోట్ల పెట్టుబడి, 14 మందికి ఉపాధి

హెచ్ సి రోబోటిక్స్: రూ.100 కోట్ల పెట్టుబడి, 500 మందికి ఉపాధి

సెన్స్ ఇమేజ్ టెక్నాలజీస్: రూ.68 కోట్ల పెట్టుబడి, 45 మందికి ఉపాధి

ఎయిర్ పేస్ ఇండస్ట్రీస్: రూ.100 కోట్ల పెట్టుబడి, 150 మందికి ఉపాధి

జేడీకే ఫ్లై డ్రోన్ వరల్డ్: రూ.114 కోట్ల పెట్టుబడి, 350 మందికి ఉపాధి

లాట్రిక్ ఎయిరో స్పేస్: రూ.10 కోట్ల పెట్టుబడి, 125 మందికి ఉపాధి

 

ఈ ప్రాజెక్టులు మడకశిర, దొనకొండ, నెల్లూరు, కర్నూలు డ్రోన్ సిటీల్లో ఏర్పాటవుతాయి.

 

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్

 

ఉదయం 08:15: క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరతారు.

ఉదయం 09:45: పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు.

ఉదయం 10:15: రోడ్డు మార్గం ద్వారా భూమిపూజ కార్యక్రమ వేదికకు చేరుకుంటారు.

ఉదయం 10:15 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు: ఏఎంసీఏ ప్రాజెక్టుతో పాటు, ఇతర 12 రక్షణ, డ్రోన్ పరిశ్రమల భూమిపూజ కార్యక్రమాల్లో రక్షణ మంత్రితో కలిసి పాల్గొంటారు.

మధ్యాహ్నం 02:20: తిరిగి అమరావతిలోని నివాసానికి చేరుకుంటారు.

 

మొత్తం మీద, ఈ భారీ ప్రాజెక్టులతో రాయలసీమ పారిశ్రామిక ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇలాంటి భారీ పరిశ్రమల ఏర్పాటుతో వెనుకబడిన ప్రాంతమనే ముద్రను చెరిపేసి, ‘రక్షణ సీమ’గా సరికొత్త చరిత్రను లిఖించబోతోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |