UPDATES  

NEWS

 వారి వల్లే ఓడిపోయా, మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు..!

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తిరుపతి వేదికగా ఆయన వైసీపీ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఒంగోలు రాజకీయాల్లో తన ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తనను ఓడించింది జనసేన లేదా టీడీపీ అభ్యర్థులు కాదని స్పష్టం చేశారు. సొంత పార్టీ నాయకులే తనను వెన్నుపోటు పొడిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జనసేన ప్రభావం వల్ల రెండుసార్లు ఓటమిని చవిచూశానని గుర్తు చేస్తూనే.. వైసీపీలో ఎదుర్కొన్న అవమానాలను ఏకరువు పెట్టారు.

 

వైసీపీలో ఉన్న సమయంలో తనను అన్ని విధాలుగా అణచివేశారని బాలినేని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసినా తనకు గుర్తింపు దక్కలేదని వాపోయారు. ఉప ఎన్నికల సమయంలో పార్టీ ప్రయోజనాల కోసం స్వయంగా రూ. 22 కోట్లు ఖర్చు చేసి భారీగా నష్టపోయానని వెల్లడించారు. ఆర్థికంగా రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకగా ఉన్న పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరినట్లు వివరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జనసేన మాత్రమే ప్రజల పక్షాన నిలబడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

జనసేనలో చేరిన తర్వాత కూడా వైసీపీ నేతలు తనను వదిలిపెట్టడం లేదని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. తాను మళ్లీ వైసీపీలోకి వెళ్తానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు. వైసీపీ నేతలు ఎన్ని కుతంత్రాలు చేసినా.. ఎంతమంది విమర్శించినా తాను పవన్ కళ్యాణ్ వెంటే ఉంటానని గట్టిగా చెప్పారు. తన చివరి శ్వాస వరకు జనసేనలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

 

పవన్ తో సినిమా తీస్తా..

 

పవన్ కళ్యాణ్ పట్ల తనకున్న అభిమానాన్ని బాలినేని చాటుకున్నారు. పవన్ అంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. భవిష్యత్తులో అవకాశం దక్కితే పవన్ కళ్యాణ్ హీరోగా ఒక భారీ సినిమా నిర్మిస్తానని తన కోరికను బయటపెట్టారు. రాజకీయాలతో పాటు వ్యక్తిగతంగా కూడా పవన్ కు మద్దతుగా ఉంటానని తెలిపారు. జనసేన బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తానని వెల్లడించారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా పవన్ నాయకత్వాన్ని బలపరుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై బాలినేని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే పార్టీ ముఖ్య నేతలు సమావేశం కావాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో వార్డు రిజర్వేషన్ల ప్రక్రియను నిశితంగా గమనించాలని సూచించారు. జనసేనకు కేటాయించాల్సిన సీట్లను ముందుగానే ఖరారు చేసుకోవాలని అధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త శ్రమించాలని ఆయన కోరారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |