UPDATES  

NEWS

 టీఎంసీ ఓడేవరకు జుట్టు కత్తిరించనంటూ శ‌ప‌థం.. 15 ఏళ్ల తర్వాత జుట్టు తీయించుకున్న బెంగాల్‌ వ్యక్తి..!

పశ్చిమ బెంగాల్‌లో ఒక వ్యక్తి పట్టిన పంతం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పాలనకు వ్యతిరేకంగా 15 ఏళ్లుగా జుట్టు కత్తిరించుకోకుండా నిరసన తెలిపిన ఓ బీజేపీ మద్దతుదారు, ఆ పార్టీ ఓటమి తర్వాత తన శపథాన్ని నెరవేర్చుకున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం సాధించడంతో, ఆయన గుండు చేయించుకుని తన దీక్షను విరమించారు.

 

వివరాల్లోకి వెళితే… పశ్చిమ బెంగాల్‌లోని బామన్ పారా గ్రామానికి చెందిన బీజేపీ మద్దతుదారు బనేశ్వర్ బర్మన్, 2011లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక శపథం చేశారు. బెంగాల్‌లో టీఎంసీ అధికారం కోల్పోయేంత వరకు తాను జుట్టు కత్తిరించుకోనని ప్రతినబూనారు. అప్పటి నుంచి గత 15 ఏళ్లుగా ఆయన తన జుట్టును పెంచుతూనే ఉన్నారు.

 

ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన విజయం సాధించి, 15 ఏళ్ల టీఎంసీ పాలనకు తెరదించింది. మొత్తం 294 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 200కు పైగా సీట్లు గెలుచుకోగా, టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం భవానీపూర్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు.

 

ఈ చారిత్రక ఫలితాల నేపథ్యంలో బనేశ్వర్ బర్మన్ తన శపథాన్ని నిలబెట్టుకున్నారు. తన గ్రామంలోని ఓ సెలూన్‌కు వెళ్లి గుండు చేయించుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. బర్మన్ గుండు చేయించుకుంటున్న దృశ్యాలను చూస్తూ సంబరాలు చేసుకున్నారు. బర్మన్ దీక్ష ఫలించిందని, ఇది బెంగాల్‌లో వచ్చిన రాజకీయ మార్పుకు నిజమైన చిహ్నమని వారు వ్యాఖ్యానించారు. ఒక సాధారణ కార్యకర్త 15 ఏళ్ల పాటు కొనసాగించిన నిరసన, బీజేపీ గెలుపుతో ముగియడం గమనార్హం.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |