UPDATES  

NEWS

 ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి గ్రీన్ సిగ్నల్..!

ఖమ్మం నగర ఆధ్యాత్మిక చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచే పరిణామం చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సహకారంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఎన్నో ఏళ్లుగా భక్తులు ఎదురుచూస్తున్న కల సాకార దశలోకి అడుగుపెట్టింది. తెలంగాణ ప్రభుత్వం ధ్వంసలాపురం రెవిన్యూ పరిధిలో కేటాయించిన 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రతిష్టాత్మక ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్ర క్యాబినెట్ ఇప్పటికే భూమి కేటాయింపుకు ఆమోదం తెలపగా, తాజాగా టీటీడీ బోర్డు కూడా అనుమతి ఇవ్వడంతో నిర్మాణానికి అన్ని మార్గాలు సుగమమయ్యాయి.

 

చిన్న తిరుమల గా..

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సమన్వయం ఈ ప్రతిష్టాత్మక యత్నానికి బలంగా నిలిచాయి. తిరుమల తరహా దర్శనం, సదుపాయాలు ఖమ్మంలోనే అందుబాటులోకి రానుండగా, జిల్లా ‘చిన్న తిరుమల’గా రూపుదిద్దుకునే దిశగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు. టీటీడీ బోర్డు ఆమోదంతో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఖమ్మం భక్తుల కల సాకార కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాసుని ఆలయ నిర్మాణం పనులు వేగంగా ప్రారంభం కానున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఖమ్మానికి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా నూతన శోభను తీసుకువచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది.

 

ఫలించింన తుమ్మల కృషి..

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, తిరుమల దర్శనానికి వెళ్లలేని వారికి స్థానికంగానే టీటీడీ తరహాలోనే టీటీడి వారి ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరంతరం రెండు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు.

 

20 ఎకరాల్లో తిరుమల వాతావరణం

ద్వంసలాపురం పరిధిలో కేటాయించిన 20 ఎకరాల భూమిలో ఆలయంతో పాటు యాత్రికుల కోసం వసతి గృహాలు, కళ్యాణ మండపం, పార్కింగ్ సౌకర్యాలు, ధార్మిక కార్యకలాపాల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఖమ్మంలో తిరుమల తరహా ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ ఏర్పడనుంది.

 

రెండు రాష్ట్రాల సమన్వయం

టీటీడీ బోర్డు ఆమోదం నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో భూమి కేటాయింపుకు ముందడుగు వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలియజేశారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ మహత్తర కార్యం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

 

అభివృద్ధికి నాంది..

టీటీడీ నిధులతో ఆలయ నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుండగా, ఈ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా కీలకంగా మారనుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వ్యాపార రంగానికి కూడా ఊతం లభించనుంది. ఖమ్మం, పరిసర ప్రాంతాల భక్తులకు తిరుమల తరహా దర్శన సౌకర్యాలు, ఆధ్యాత్మిక అనుభూతి స్థానికంగానే అందుబాటులోకి రానుంది.ఉపాధి అవకాశాలు విస్తరించడంతో పాటు రహదారులు, మౌలిక వసతులు మెరుగుపడే అవకాశముంది. ప్రాంత అభివృద్ధికి ఊతం కానుంది.

 

ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోనున్న ఆలయం

టీటీడీ ప్రణాళికల ప్రకారం ఆలయాన్ని సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. నిత్య కైంకర్యాలు, అర్చనలు తిరుమల విధానంలో నిర్వహించడంతో పాటు సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. భక్తులకు ఉచిత అన్నప్రసాదం, వసతి గృహాలు, విశాలమైన పార్కింగ్ స్థలాలు, ఆధునిక క్యూ లైన్లు, లడ్డూ ప్రసాదం పంపిణీ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. శుచిత్వం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

 

తిరుమల శైలిలో నిర్మాణం

టీటీడీ నిర్మించే ఆలయాలు సాధారణంగా తిరుమల శైలిని ప్రతిబింబిస్తాయి. ఖమ్మంలో కూడా అదే నమూనాలో ఆలయ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. దీంతో భక్తులకు తిరుమల వాతావరణాన్ని ఇక్కడే అనుభవించే అవకాశం కలగనుంది. మొత్తంగా, టీటీడీ ఆమోదంతో ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం భక్తి, అభివృద్ధి, ఆర్థిక పురోగతికి కొత్త దారులు తీసుకురానుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం ప్రజల దీర్ఘకాలిక కోరిక నెరవేరిందని త్వరలోనే టీటీడీ అధికారులతో సమావేశమై నిర్మాణ పనులను వేగవంతం చేస్తాం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా వెల్లడించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |